
అదిగదిగో అయోధ్యాపురి.. రఘుకుల తిలకుడు ఏలిన నగరం.. జగదభిరాముడి జన్మస్థలం..
భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరితే పులకించిపోయెను యావత్ భారతం..
అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం తమ అంతరంగంలో ఆత్మారాముడిని కొలుచుకున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామలల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. 12.29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పాల్గొన్నారు.
రామనామంతో మార్మోగిన అయోధ్య..
రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. ఎటు చూసినా రామనామ స్మరణతో మార్మోగింది. నగరమంతా రామ్ లీల, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
అపురూప క్షణాలను వీక్షించిన ప్రముఖులు..
ఈ మహత్కార్యానికి దేశ, విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7 వేల మంది విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు.





