
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అయిదు వెండి ఇటుకలు అందజేసిన హైదరాబాద్ వాసి, భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాసశాస్త్రి బంగారు పూత పూసిన 9 కేజీల వెండి పాదుకలనూ సమర్పించారు. వీటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామ, అంతర్వేది పుణ్యక్షేత్రాల్లో పూజలు చేశారు. తాళ్లరేవు కోదండ రామాలయం, కాకినాడ శ్రీపీఠంలో భక్తుల సందర్శనార్థం ఉంచారు. గతేడాది అక్టోబర్ 28న రాయవరం మండలం వెదురుపాక నుంచి పాదయాత్రగా బయలుదేరి రాజమహేంద్రవరం, భద్రాచలం మీదుగా అయోధ్య చేరారు.
అంతా రామమయం..
అయోధ్యలో కీలక ఘట్టానికి గడియలు సమీపిస్తున్న వేళ ఊరూరా.. ఇంటింటికీ రాములోరి అక్షింతలు పంచిపెట్టి రామమందిరం ప్రాశస్త్యాన్ని భక్త బృందాలు ఇప్పటికే వివరించాయి. వేడుకను చూసేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురికి ఆహ్వానాలు అందాయి. వీరే కాకుండా అవకాశం ఉన్న అనేకమంది ముందస్తు ప్రణాళికలతో సన్నాహాలు చేసుకున్నారు. ప్రారంభోత్సవం రోజున సామాన్య భక్తులు వెళ్లి స్వామిని దర్శించుకోవడం కష్టమే.. ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ఆరోజు రావద్దనే సంకేతాలు పంపారు. ఊరూవాడా వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో రామ నామ స్మరణలు, సీతారాముల కల్యాణాలు, పట్టాభిషేక ఘట్టాలకు ఇళ్లు, ఆలయాల్లో సన్నాహాలు చేస్తున్నారు.
నీలమేఘ శ్యాముని చిత్రరాజం..
అయోధ్యలో నిర్వహించే చిత్ర కళా ప్రదర్శనలో రాజమహేంద్రవరం నగరానికి చెందిన చిత్రకారుడు పుప్పాల బాపిరాజు గీసిన తైల వర్ణ చిత్రానికి చోటు దక్కింది. భారతదేశ చిత్రపటంలో శ్రీరాముని చిత్రంతో ఆకట్టుకునే రీతిలో రామభక్తిని ప్రతిబింబించేలా దీనిని రూపొందించారు.
స్వాములకు ఆహ్వానం..
అయోధ్యలో వేడుకకు రావాలంటూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 15 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలకు ఆహ్వానం అందింది. పరిపూర్ణానంద, చాగంటి కోటేశ్వరరావు, కృష్ణానంద సరస్వతి, త్రిదండి శ్రీరంగ రామానుజ జియర్ స్వామి, జ్ఞానేశ్వరి మాతాజీ, సత్యానందగిరి, సామవేదం షణ్ముఖశర్మ, ప్రసాద స్వామీజీ, తునిలోని సచ్చిదానంద తీర్థ స్వామీజీ తదితరులతోపాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం.
కోనసీమ కల్యాణ బోండాలు..
శ్రీరాముని సన్నిధికి కల్యాణ బోండాలను మండపేటకు చెందిన భక్తుడు కె.వి.ఎ.రామారెడ్డి సమర్పించారు. శంఖు- చక్ర- శ్రీవారి నామాలతో నారికేళాలు సిద్ధంచేశారు. వాటిని శుక్రవారం అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌కు అందజేశారు. ప్రతిష్ఠ రోజున మందిరానికి తరలిస్తారు.





