News

వైరల్‌ అవుతున్న ఫొటోలపై దర్యాప్తు చేపట్టాలి ; అయోధ్య ఆలయ పూజారి డిమాండ్‌

339views

అయోధ్య రామజన్మభూమిలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ముందే అయోధ్య రాముడి విగ్రహ దివ్యమంగళ రూపం బయటికొచ్చింది. గర్భగుడిలోకి చేర్చకముందే కళ్లకు ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫొటోలు శుక్రవారం నెట్టింట వైరల్‌గా మారాయి. దీన్ని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ తీవ్రంగా పరిగణించి ఇందుకు బాధ్యులను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది.

ఈ పరిణామాలపై శ్రీరామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘గర్భగుడిలోకి చేర్చిన శ్రీరాముడి విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా వస్త్రం కట్టి ఉంచాం. ప్రాణప్రతిష్ఠ సమయంలోనే ఆ వస్త్రాన్ని తొలగిస్తాం. అంతకంటే ముందే పూర్తి రూపం కన్పించే ఫొటోలను బయటపెట్టడం సరికాదు. అలాంటి ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి . వాటిపై దర్యాప్తు జరిపించాలి. ఎవరు ఆ పని చేశారో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన డిమాండ్‌ చేశారు.

మైసూరుకు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ రూపొందించిన 51 అంగుళాల పొడవున్న రామ్‌లల్లా విగ్రహాన్ని ఇటీవల గర్భగుడికి చేర్చిన సంగతి తెలిసిందే. బాలరాముడు నిలబడిన భంగిమలో ఉన్న చిత్రాన్ని విశ్వహిందూపరిషత్‌ విడుదల చేసింది. కృష్ణశిలతో చెక్కిన ఆ విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా పసుపురంగు వస్త్రం కట్టి గులాబీదండతో అలంకరించారు. అయితే, పూర్తి రూపం కన్పించే ఫొటోలు శుక్రవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ట్రస్ట్‌ అంతర్గత విచారణ చేపట్టింది. ఆలయ ప్రాంగణంలో నిర్మాణపనుల్లో ఉన్న సిబ్బందే ఈ ఫొటోలను లీక్‌ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.