
ఆదివారం వస్తే చాలు ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడితే…. ఇక్కడి ఊరివాళ్లు మాత్రం మాంసాహారం తీసుకోకుండా, మద్యం ముట్టకుండా ఎంతో నియమనిష్టలతో ఉంటారు. గర్భగుడికి పైకప్పు అంటూ లేకపోవడం, నేలపైన ఉండే స్వామి విగ్రహం… ఈ గుళ్లో ప్రత్యేకతలు. సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్ప రూపంలో కొలువుదీరి భక్తుల పూజల్ని అందుకుంటున్న నంద్యాలలోని ఈ ఆలయానికి దాదాపు మూడువందల సంవత్సరాల చరిత్ర ఉంది.
ఎత్తైన గోపురాలతో, ఆకట్టుకునే నిర్మాణశైలితో ఉండే ఆలయాలతో పోలిస్తే… ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడి కాస్త భిన్నంగానే ఉంటుంది. నంద్యాలలోని ఎస్. కొత్తూరు అనే గ్రామంలో కనిపించే ఈ ఆలయంలో సుబ్బారాయుడిగా పిలిచే ఈ స్వామి విగ్రహం ఇక్కడ స్వయంభువుగా వెలిసిందనడానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

స్థలపురాణం
సుమారు మూడువందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో నివసించిన బీరం చెన్నారెడ్డి అనే రైతు ఓ రోజు పొలం దున్నుతున్నప్పుడు నాగలికి ఏదో రాయి అడ్డు తగిలినట్లుగా పెద్ద శబ్దం వచ్చిందట. కాసేపటికి ఆ రైతుకి చూపు పోవడంతో… చుట్టుపక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కిలాగి భూమిలో ఏముందో చూస్తే పన్నెండు శిరస్సులతో ఉన్న నాగేంద్రుడి విగ్రహం బయటపడిందట. ఆ సమయంలో దారిన పోతున్న ఓ బ్రాహ్మణుడు అది సుబ్రహ్మణ్యేశ్వరుడి విగ్రహమనీ ఆ స్వామికి మూడురోజులు అభిషేకం చేస్తే రైతుకు పోయిన చూపు తిరిగి వస్తుందనీ సూచించాడట. అలాగే చేయడంతో రైతుకు చూపు తిరిగి వచ్చిందట. తరువాత ఊరివాళ్లంతా కలిసి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకోవడంతో స్వామి కలలో కనిపించి రాత్రి ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టి… తెల్లవారుజామున కోడి కూతకు ముందు ముగించాలంటూ ఆజ్ఞాపించాడట. దాంతో ఊరివాళ్లంతా స్వామి విగ్రహాన్ని అలాగే నేలపైన ఉంచేసి నిర్మాణం ప్రారంభించినా కోడి కూతకు ముందు కేవలం గర్భగుడి చుట్టూ గోడ మాత్రమే పూర్తయ్యిందట. అప్పటినుంచీ గర్భగుడిని అలాగే వదిలేశారనీ, అందుకే ఇక్కడి గర్భగుడికి పైకప్పు అంటూ ఉండదనీ…అలా స్వామి ఇక్కడ కొత్తూరు సుబ్బారాయుడిగా పూజలు అందుకుంటున్నాడనీ ప్రతీతి.
ముందు స్వామినే పూజిస్తారు
ఈ ఆలయంలో శివుడితోపాటు ఇతర దేవతా విగ్రహాలూ ఉన్నా… ముందు సుబ్రహ్మణ్యేశ్వరుడినే దర్శించుకుని అభిషేకాలను నిర్వహిస్తారు భక్తులు.

ఆదివారం స్వామికి ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారని చెబుతారు ఆలయ నిర్వాహకులు. ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే సర్పదోషాలు పోతాయని భక్తుల నమ్మకం. అందుకే అనారోగ్యంతో బాధపడుతున్నవారూ, పెళ్లికానివారూ, ఉద్యోగాన్వేషణలో ఉన్నవారూ మంగళవారం నాడు అభిషేకాలను నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. తమ కోరికలు తీరినవారు… నాగ ప్రతిష్ఠ చేయించేందుకు ఆసక్తి చూపిస్తారు.
వామి ఆ ఊళ్లో స్వయంభువుగా కొలువుదీరి తమను చల్లగా కాపాడుతున్నాడని నమ్మే కొత్తూరు గ్రామస్థులు ఆదివారం నాడు మందు ముట్టకుండా, మాంసం తీసుకోకుండా ఉండాలని ఆలయ నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచీ ఓ ఆచారంగా పెట్టుకుని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఆదివారం నాడు ఏదయినా పండుగ వచ్చినా మర్నాడే మాంసాహారాన్ని వండుకుంటారు. ప్రస్తుతం 220 కుటుంబాలు, వెయ్యికి పైగా జనాభా ఉన్న ఆ గ్రామంలో ఆదివారంనాడు ఎవరైనా మరణించినా సరే వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకునే భక్తులకు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతోనే ఆ తర్వాతి రోజే అంత్యక్రియలను నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవచ్చు
ఈ ఆలయానికి వెళ్లాలనుకునే భక్తులు నంద్యాల వరకూ రైల్లో లేదా బస్సుల్లో చేరుకోవాలి. అక్కడి నుంచి పాణ్యం మీదుగా నందివర్గం వరకూ వెళ్లేందుకు బస్సులూ ఆటోలూ అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి ఆలయం అయిదుకిలోమీటర్ల దూరంలో ఉంటుంది.





