News

370 అధికరణం రద్దుపై నేడు తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు

297views

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు అంశంపై సోమవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాలుగా కశ్మీర్‌ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహించారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పును ఎవరూ రాజకీయం చేయరాదని, దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబరు 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా ఆ తీర్పును సోమవారం వెలువరిస్తానని సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ధర్మాసనంలో ఇతర సభ్యులుగా జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ ఉన్నారు.