News

సనాతన ధర్మ నిర్మూలన వ్యాఖ్యలు ; తమిళ మంత్రుల తీరుపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

264views

అధికారంలో ఉన్నవారు సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేసే ధోరణి ప్రబలుతోందంటూ మద్రాస్ హైకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంపై చూపే ప్రతికూల ప్రభావం తాలూకు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సెప్టెంబర్ లో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవడం తెలిసిందే. సనాతన ధర్మ నిర్మూలన పేరిట జరిగిన ఆ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు అందులో పాల్గొన్న అధికార డీఎంకేకు చెందిన పలువురు ఇతర మంత్రులు కూడా మద్దతు పలికారు. ఈ ధోరణిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు దిగే బదులు డ్రగ్స్, అవినీతి, అంట రానితనం తదితర పెడ ధోరణుల నిర్మూలనపై దృష్టి పెడితే మంచిదని వారికి సూచించింది. సదరు మంత్రులపై ఇంకా చర్యలెందుకు తీసుకోలేదంటూ పోలీసులకు హైకోర్టు తలంటింది.

మంత్రుల వ్యాఖ్యలకు పోటీగా ద్రవిడ సిద్ధాంత నిర్మూలన సదస్సుకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను న్యాయమూర్తి జస్టిస్ జె.జయచంద్రన్ కొట్టేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. “సనాతన ధర్మ నిర్మూలన సభను ఉదాహరిస్తూ, అందుకు పోటీగా సభ పెట్టుకునేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రులు తదితరులపై అప్పుడే చర్యలు ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా! పిటిషనర్ విజ్ఞప్తికి అంగీకరించడమంటే సమాజం లో మరింత చీలిక తేవడమే కాదా?” అని ప్రశ్నించారు.

మంత్రుల తీరుపైనా ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రాజ్యాంగ స్పూర్తిని నిలబెడతామంటూ చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా అధికారంలో ఉన్న కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి సమావేశాలకు అనుమతినిచ్చి వారికి శాంతిని మరింత కరువు చేయమంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.