
దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత.. ‘ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తోందని’ ఆవేదన చెందింది. ఈ సందర్భంగా వాయు కాలుష్యంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందలు వేసుకోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఇది రాజకీయ యుద్ధం కాకూడదని సూచించింది. వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్న పంట వ్యర్థాల దగ్ధాన్ని తక్షణమే ఆపాలని ఢిల్లీ పొరుగు రాష్ట్రాలను ఆదేశించింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఆందోళనకర రీతిలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వాల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ప్రతి ఏడాది ఢిల్లీ ఇలా కాలుష్యం కోరల్లో నలిగిపోకూడదు. ప్రతిసారి దీన్ని రాజకీయం చేయకూడదు. పొరుగున ఉన్న పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దగ్ధాలతో ఏటా శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఈ పంట వ్యర్థాల దగ్ధం ఆగాలి. ఎలా ఆపుతారో మాకు సంబంధం లేదు. అది మీ పని (రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ). కొన్ని సార్లు కఠిన చర్యల ద్వారా… మరి కొన్నిసార్లు ప్రోత్సాహకాల ద్వారా.. ఎలాగైనా సరే ఇది ఆగాలి. తక్షణమే జరగాలి. ఈ రోజు నుంచే ఆ పని ప్రారంభించండి’’ అని ఆ నాలుగు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.




