News

ఆకాశం లో సగం – అవకాశాల్లో సగమే కాదు అంతకు మించి అంటూ కదిలిన, నారీ శక్తి

326views

నంద్యాల జిల్లా, అఖిల భారతీయ మహిళా సమన్వయ కమిటీ నిర్ణయం మేరకు భారతదేశంలో 435 విభాగ్ ల నారీ శక్తి సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో నారీ శక్తి సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణులు, అధ్యాపకులు, ఉపాద్యాయులు, స్వచ్ఛంద కార్యకర్తలు వంటి పలు వర్గాల్లోని 1500 పై చిలుకు మహిళా మూర్తులు పాల్గొన్నారు. “కర్తృత్వం…మాతృత్వం…‌నేతృత్వం.‌‌..” అనే మూల సూత్రాల ప్రాతిపధికన ” నారీ శక్తి సమ్మేళనం ” లో పాల్గొని సనాతన భారతంలో సమాజాన్ని ప్రభావితం చేసిన ఎందరో మహిళా మూర్తుల ధీర, వీర, స్థైర్య స్ఫూర్తిదాయక ఉదంతాలను స్ఫురణకు తెచ్చేలా కార్యక్రమం సాగింది. నేటి సమాజంలో భారతీయ సాంప్రదాయ కుటుంబం విలువలు ఎదుర్కొంటున్న సమస్యలను వాటి పరిష్కారానికి మహిళల కర్తవ్యం గురించి, సుస్థిర సమాజం అభివృద్ధికి, మహిళా మూర్తుల ప్రాధాన్యత పై చర్చించారు.

భారతీయ మహిళ విధూషీ మణి, వీరాంగన, ఉత్తమ గృహిణి ఆమె మూలంగానే ఈ నాటికీ భారతీయ సంస్కృతి నిలచిందని, విదేశీయ దాడులు, అకృత్యాలు ఆమెను వ్యక్తిగతంగా, సామాజికంగా ఎదగనీయక అణచివేసిందని, పాశ్చాత్య స్త్రీ వాదమే సరియైనదనే భ్రమలో మునిగిన మన మహిళలు వాస్తవం తెలుసు కోవాలని, అర్ధ నారీశ్వర తత్వం ఆలంబనయైన మన సమాజంలో మహిళ తిరిగి సహజమైన శక్తి’ స్వరూపం ధరించాలని ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి విజయ భారతి పిలుపు నిచ్చారు.

భారతదేశం ఆన్ని రంగాలలో సుస్థిరఅభివృద్ధి సాధించి ముందంజ వేయాలని, అందుకై ముహిళలు మాతృమూర్తి గా, వృత్తిపరంగా, శాస్త్రవేత్తలుగా, సామాజిక కార్యకర్తలుగా జాతీయతా భావనలను పోషించడం అవసరమని ప్రాంత సంయోజిక శ్రీమతి కోడూరు మధు కుమారి తెలిపారు.

డా॥ సత్యసుందరి, డా॥ స్వర్ణలత, శ్రీమతి విజయభారతి న్యాయవాది, మహిళ సమన్యయి, ప్రాంత సంయోజిక, శ్రీమతి మధు కుమారి, శ్రీమతి మురళి కళ్యాణి, శ్రీమతి శైలజ. శ్రీమతి సంధ్య, శ్రీమతి గాయత్రి. శ్రీమతి జ్యోతి చిలుకూరి, శ్రీమతి లీలావతి తదితర ముఖ్య కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.