News

విద్యార్థి అయ్యప్పదీక్ష దుస్తులు ధరించడంపై టీచర్ అభ్యంతరం

297views

విశాఖ పాతనగరం అల్లిపురం నీలమ్మవేపచెట్టు దరి ప్రియాంక విద్యోదయ పాఠశాలలో చదివే విద్యార్థి అయ్యప్పదీక్ష దుస్తులు వేసుకుని రావడంపై ఉపాధ్యాయురాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి, పలు హిందూ సంఘాల ప్రతినిధులు పాఠశాల యాజమాన్య ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసానంద సరస్వతీ స్వామి మాట్లాడుతూ అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థినిని పాఠశాలకు రానివ్వకపోవడం దారుణమన్నారు. ఇది విద్యార్థి ప్రాథమిక హక్కును కాలరాయడమేనన్నారు. హిందూ సంఘాల ప్రతినిధి తురగా శ్రీరామ్‌ మాట్లాడుతూ అయ్యప్ప దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దిగివచ్చిన యాజమాన్యం సంబంధిత ఉపాధ్యాయురాలితో విద్యార్థికి క్షమాపణ చెప్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలోని వినాయకుడి విగ్రహం వద్ద అయ్యప్పస్వామి భజన నిర్వహించారు. హిందూ సంఘాల ప్రతినిధులు రామచంద్రమూర్తి, విజయ్‌శంకర్‌, ఫణిధర్‌, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.