News

ఈ నెల 18న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘‘జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్’’ నాటకం ప్రదర్శన

438views

తరాలు మారినా వన్నె తగ్గని పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ పేరు విన్నా..రూపం చూసినా, ప్రతి హిందువుకూ తన కర్తవ్యం గుర్తుకు వస్తుంది. హైందవ జాతికి శివాజీ చేసిన సేవ, త్యాగం వింటే ప్రతి ఒక్కరిలో ప్రేరణ కలిగి, స్ఫూర్తి రగులుతుంది. హిందూ సమాజంపై ఎక్కడ దాడి జరిగినా నేనున్నానంటూ అభయం కల్పించిన వీరుడు శివాజీ. హిందూ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలను కాలరాసి క్రూరంగా మతమార్పిడులకు పాల్పడుతున్న మొగల్ రాజుల మెడలు వంచిన వీరుడు శివాజీ.

హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి హైందవ జాతిని జాగృతం చేసిన ఆ మహనీయుడి 350వ పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ‘సంస్కార భారతి’ ‘‘జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్’’ చారిత్రక నాటకాన్ని ఈ నెల 18న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటకం పోస్టర్‌ను, ఆడియోను శివాజీ స్ఫూర్తి కేంద్రం సంఘటనా కార్యదర్శి శ్రీ సోమయాజుల నాగేశ్వరరావు ఆవిష్కరించారు.

పీవీఎన్. కృష్ణ స్వీయ రచనా దర్శకత్వంలో రూపొందించిన జయహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రాత్మక నాటకాన్ని డా. రామన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ సాయిబాబా నాట్య మండలి ప్రదర్శించనుందని తెలిపారు. ఈ నెల 18న సాయంత్రం 06:00 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రదర్శించే నాటకానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అన్నారు. ఛత్రపతి శివాజీ దేశభక్తి, ధర్మ నిష్ఠ, దీక్ష, పట్టుదల, వ్యూహ చతురత తరతరాలకు ఆదర్శమని సోమయాజులు నాగేశ్వరరావు పేర్కొన్నారు