
బంగ్లాదేశ్‌తో ఉన్న సరిహద్దుల వెంబడి నేరాలను తగ్గించడానికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. కంచెపై తేనెటీగల పెంపకం పెట్టెల (ఎపికల్చర్)ను ఏర్పాటు చేసింది. దీనివల్ల స్మగ్లింగ్, ఇతర నేరాలకు కళ్లెం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానికులకు జీవనోపాధి కూడా లభిస్తుందని వివరించింది. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి ఆయుష్ మంత్రిత్వశాఖ కూడా తోడ్పాటు అందిస్తోంది. ప్రాజెక్టుకు అవసరమైన తేనెటీగల పెట్టెలు, వాటిని సరిహద్దు కంచెకు అమర్చడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించింది. పుష్పించే ఔషధ మొక్కలనూ ఆయుష్ మంత్రిత్వశాఖ ద్వారా తెప్పించినట్లు బీఎస్‌ఎఫ్ అధికారి సుజిత్ కుమార్ తెలిపారు. వాటిని తేనెటీగల పెట్టెలు ఏర్పాటు చేసిన పరిసరాల్లో నాటామని చెప్పారు. నదియా జిల్లాలో సరిహద్దు వెంబడి పశువులు, బంగారం, వెండి, మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ఎక్కువ. ఇందుకోసం స్మగ్లర్లు కంచెను కత్తిరించిన ఉదంతాలూ ఉన్నాయి. ఇక నుంచి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తేనెటీగల దాడిని వారు ఎదుర్కోక తప్పదు.




