News

మరికొన్ని గంటల్లో బెజవాడకు అయోధ్య శ్రీరామ అక్షింతలు

422views

మరికొన్ని గంటల్లో బెజవాడకు అయోధ్య శ్రీరామ అక్షింతలు

కోట్లాది హిందువుల కల గత ఐదు శతాబ్దాల పోరాటాల ఫలితంగా రామ జన్మభూమి ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. సరయు తీరంలో రూపుదిద్దుకుంటున్న శ్రీరామ జన్మభూమిలో భవ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన గర్భాలయం ప్రాణప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా ఒక్కొక్క ఘట్టం ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామ అక్షింతల పూజా కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ క్రమంలో అయోధ్య శ్రీ రామ అక్షింతలు ఆంధ్రప్రదేశ్‌కు ఈ నెల 7న చేరుకోనున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకోగా.. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో అక్షింతలను తీసుకుని వచ్చి నగరంలోని పూర్ణనందంపేట వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.అలాగే కర్నూలులోని భారత మాత మందిరంలో కూడా అక్షింతలను ఉంచనున్నారు.

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆ అక్షింతలను ప్రతి రాష్ట్రం నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్న ఇద్దరు ప్రతినిధులకు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ సమితి ప్రతినిధులు 7వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ లోనూ, కర్నూల్ రైల్వే స్టేషన్ లోనూ పూజిత అక్షింతలను అందుకోనున్నారు.

రామయ్య అక్షింతలను ఈ నెల 16న ముత్యాలంపాడులోని శ్రీ సీతా, లక్ష్మణ, హనుమాన్ సమేత శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి పాదల చెంత ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం వివిధ జిల్లాలకు తరలించనున్నారు.అలాగే కర్నూలు భరతమాత మందిరంలోప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి రాయలసీమ జిల్లాలకు తరలించనున్నారు.