
అయోధ్యలో రామమందిర నిర్మాణంతో దేశంలో కులం, మతం ఆధారంగా విచక్షణకు తావు లేని ‘ రామరాజ్యం ప్రారంభమయిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కొంటలో ఆదివారం జరిగిన బిజెపి ఎన్నికల సభలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లవ్‌జిహాద్, మత మార్పిడులను ప్రోత్సహించిందని ఆరోపించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జనవరిలో పూర్తవుతుందని చెబుతూ ఈ ఆలయం పూర్తయితే యూపీ ప్రజలకన్నా చత్తీస్‌గఢ్ ప్రజలే ఎక్కువగా సంతోషిస్తారని తెలిపారు.
ఎందుకంటే చత్తీస్‌గఢ్ శ్రీరాముడి నానిహాల్ (అమ్మమ్మ చోటు) అని, అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయితే దేశంలో రామరాజ్య ప్రకటన ప్రారంభమవుతుందని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ‘రామరాజ్యం అంటే కులం, మతం ఆధారంగా వివక్ష లేని పాలన. పథకాల ప్రయోజనాలు పేదలు, అణగారిన వర్గాలు, గిరిజనులు సహా అన్ని వర్గాలకు అందుతాయి. ప్రతి ఒక్కరికీ భద్రత, సదుపాయాలు, వనరులపై హక్కులు లభిస్తాయి’ అని స్పష్టం చేశారు.





