News

మణిపూర్‌ లో హింసాత్మక చిత్రాలు, వీడియోలపై నిషేధం

252views

మణిపూర్‌ రాష్ట్రంలో హింసాత్మక చిత్రాలు, వీడియోలపై మణిపూర్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. చిత్రాలు, వీడియోలు ఎవరైనా ప్రసారం చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.

ఒక వ్యక్తి మృతదేహాన్ని కందకంలో కాల్చినట్టు చూపించే వీడియో సోషల్‌ మీడియాలో వెలువడిన మూడు రోజుల తర్వాత రాష్ట్ర హోం శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మే 4వ తేదీకి సంబంధించిన వీడియో అని పోలీసులు స్పష్టం చేశారు. ఇటువంటి ఫోటోలు, వీడియోలు ఆందోళనకారుల గుంపులను సమీకరించగలవనీ, దీంతో శాంతిభద్రతల ఆందోళనలు తీవ్రతరం అవుతాయని ప్రభుత్వం తెలిపింది. సాధారణ స్థితిని తీసుకురావడానికి ఇటువంటి విషయాలను నిరోధించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది.

హింస, ద్వేషాన్ని ప్రేరేపించడానికి ఎవరైనా సాంకేతికతను దుర్వినియోగం చేస్తే సమాచార సాంకేతిక చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత నిబంధనల ప్రకారం తగిన విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం శాఖ వివరించింది.