
ఇజ్రాయెల్ – హమాస్‌మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం హైఅలర్ట్ ప్రకటించారు.ఢిల్లీలో సంఘ విద్రోహ శక్తులు ఆందోళనలకు పాల్పడే అవకాశాలున్నాయని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం, యూదుల మతపరమైన ప్రదేశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నివసిస్తున్న ఇజ్రాయెలీ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లోనూ భద్రతను పెంచారు. ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు, సిబ్బంది, పర్యాటకులకు రక్షణ కల్పించాలని మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, గోవా తదితర రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో పాలస్తీనీయన్లకు మద్దతుగా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. యూదులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే ముప్పు పొంచి ఉండటంతో ఆయా దేశాల్లోనూ భద్రతను పెంచారు.





