News

పారా ఆసియా క్రీడలకు భారత బృందం పయనం

269views

ఆసియా క్రీడలు ముగిశాయి. ఇప్పుడిక పారా ఆసియా క్రీడలకు సమయం ఆసన్నమైంది. హాంగ్జౌ వేదికగా ఈనెల 22 నుంచి 28 వరకు నాలుగో పారా ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడల్లో 309 మందితో కూడిన భారత జట్టు బరిలో దిగుతోంది. వీరిలో 196 మంది పురుషులుకాగా 113 మహిళా అథ్లెట్లున్నారు. మొత్తం 17 విభాగాల్లో భారత క్రీడాకారులు తలపడుతున్నారు. కనోయింగ్‌, బ్లైండ్‌ ఫుట్‌బాల్‌, లాన్‌బౌల్స్‌, రోయింగ్‌, తైక్వాండోలో మొదటిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత పారా ఆసియాడ్‌లో భారత్‌ మొత్తం 72 పతకాలు సాధించింది. ఈసారి అంతకు మించి రాణించాలని భావిస్తున్న మనోళ్లు..గురువారం హాంగ్జౌ పయనమయ్యారు. కేంద్ర మంత్రులు హర్దీప్‌ సింగ్‌ పురి, అనురాగ్‌ ఠాకూర్‌, భారత పారా ఒలింపిక్‌ కమిటీ చైర్మన్‌ దీపా మాలిక్‌ తదితరులు భారత అథ్లెట్లకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా భారత జట్టు పతాకధారికి జెర్సీని అందజేశారు. అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ ‘పారా అథ్లెట్లకు ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుంది. దేశం గర్వించేలా మీరు రాణిస్తారని నమ్మకముంది’ అని అన్నారు.