
భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీలంక ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందులో శ్రీలంక ప్రధాని దినేష్ గుణవర్ధన పాల్గొన్నారు. ప్రపంచ వేదిక పై భారతదేశం తన గౌరవాన్ని ఇనుమడింపజేసుకుందని అంతేకాక అంతర్జాతీయ యవనిక పై ప్రతిష్టను, స్థానాన్ని మేరుగుపరుచుకుందని ప్రశంసించారు. మిషన్ చంద్రయాన్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా భారతీయులకు అభినందనలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తమ దేశ అధ్యక్షుడు విక్రమ సింఘే భేటి సహ్రుద్భావ వాతావరణంలో కొనసాగిందన్నారు.
శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాలు గత ఏడాదిగా మరింత మేరుగుపడ్డాయని శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే అన్నారు. తమ దేశాల మధ్య జలాలు విభజన కాదని అనుసంధానమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పలువురు శ్రీలంక మంత్రులు, తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంకలోని భారతీయ సంఘం సభ్యులు పాల్గొన్నారు.





