News

చంద్రుడిపై విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ పునరుద్ధరణ రేపటికి వాయిదా

246views

చంద్రుడిపై నిద్రాణస్థితి(స్లీప్‌ మోడ్‌)లో ఉన్న చంద్రయాన్‌-3 కు సంబంధించిన విక్రమ్‌ ల్యాండర్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌ను పునరుద్ధరించే ప్రణాళికలను శనివారానికి వాయిదా వేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. తొలుత ఈ రోజు సాయంత్రం ల్యాండర్‌, రోవర్‌ను తిరిగి యాక్టివేట్‌ చేయాలని భావించినట్లు స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల దీనిని శనివారం చేపడతామని చెప్పారు.

అయితే శుక్రవారం నుంచి చంద్రుడిపై తిరిగి లూనార్‌ డే ప్రారంభమైంది. దీంతో నిద్రావస్థలో ఉన్న ల్యాండర్‌, రోవర్‌ను తిరిగి క్రియాశీలకంగా చేసేందుకు చేసే చర్యలను శనివారానికి ఇస్రో వాయిదా వేసింది.

కాగా, లూనార్‌ నైట్ సందర్భంగా చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉండే మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు, అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఇవి తిరిగి పని చేస్తాయా అన్నది సందిగ్ధంగా మారింది. ఒకవేళ విక్రమ్ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి పని చేస్తే భారత్ మరో చరిత్ర సృష్టించినట్లు అవుతుంది.