పర్యావరణం గురించి పెద్ద వయస్సు వాళ్లు కొంత చొరవ చూపటం చూస్తుంటాం. కానీ బడికి వెళుతున్న చిన్నారులే ముందుకు వచ్చి పర్యావరణం గురించి పని చేయటం ఆసక్తిదాయకం. విద్యా భారతి కి అనుబంధంగా ఉండే భారతీయ విజ్ఞానకేంద్రం (BVK) పాఠశాలలు ఈ దిశగా చొరవ తీసుకొన్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అనేక చోట్ల బీవీకే పాఠశాలలు సేవాభావనతో నడుస్తున్నాయి.
ఈ క్రమంలో బంగాళాఖాతం తీరం వెంబడి అనేక గ్రామాల్లో సాగర తీర శుభ్రతా దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. అనకాపల్లి జిల్లాలోని ముత్యాలమ్మ పాలెం, వడ చీపురుపల్లి, దిబ్బపాలెం, తిక్కవాని పాలెం, వడ నరసాపురం, కొత్త పాలెం గ్రామాల్లో దీనిని నిర్వహించారు. ఇదే ప్రాంతంలోని గునిపూడి, బంగారయ్య పేట, రాజయ్యపేట, ములపర్రు, పెంటకోట వంటి గ్రామాల్లో శుభ్రత కార్యక్రమం చేపట్టారు. బీవీకే పాఠశాలల విద్యార్థులు, ఆచార్యులు పెద్దఎత్తున సముద్రతీరానికి చేరుకొని అక్కడ పేరుకొని పోయిన చెత్తను తొలగించారు.
మత్స్యకార గ్రామాలకు మేలు చేసేందుకు ఇంతటి చొరవ తీసుకొన్న బీవీకే విద్యార్థులు, ఆచార్యులను గ్రామస్తులు అభినందించారు. కాకినాడ జిల్లాలోని పెరుమాళ్లపురం, హేమవరం, చింతకాయల పేట, సాల్మన్ పేట, తాళ్లతంటి పేటలో సాగర శుభ్రత కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని చిక్కారిపాలెం, బత్తివాని పాలెం, పెదకారివానిపాలెం వంటి చోట్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే స్ఫూర్తితో తర్వాత కాలంలో సాగరతీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పనిచేయాలని తీర్మానించారు. మారుమూల పల్లె ప్రజలకు మేలు చేసేందుకు ఇంతటి బ్రహత్తర కార్యక్రమాన్ని నిర్వహించిన బీవీకే సేవా సంస్థల్ని అంతా అభినందించారు.