కొందరు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవడానికి బస్సులు, ట్రైన్లు, ఇతర రవాణా సదుపాయాల్లో వెళ్తుంటారు. ఇంకొందరు కాలినడకన పుణ్యక్షేత్రాలకు వెళ్లి దేవుడ్ని దర్శించుకుంటారు. అదే కోవకు చెందిన వ్యక్తి ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజ్నోర్‌కు చెందిన మదన్ సింగ్ (25). ఇప్పటికే కాలినడకన కేదార్‌నాథ్, కావడి యాత్రలను పూర్తి చేసిన ఆ యువకుడు, ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రను పాదయాత్ర చేస్తున్నారు.
దైవ భక్తి, విశ్వాసాలే నాకు బలం : మదన్ సింగ్
గత ఆరు నెలలుగా తాను నిరంతరాయంగా కాలినడకన యాత్రలకు వెళ్తున్నట్లు మదన్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత కేదార్‌నాథ్, కావడి యాత్రను విజయవంతంగా పూర్తి చేశానని చెప్పారు. ప్రస్తుతం జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మీదుగా రాంబన్ జిల్లా గుండా అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్నానని స్పష్టం చేశారు. తన భక్తి, విశ్వాసాలే ఈ సుదీర్ఘమైన, కఠినమైన ప్రయాణాన్ని కొనసాగించడానికి తనకు బలాన్ని ఇస్తున్నాయని వెల్లడించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండానే గమ్యస్థానం వైపునకు సాగుతున్నానని పేర్కొన్నారు. మార్గమధ్యంలో వివిధ ప్రాంతాల ప్రజలు అందించిన ప్రేమ, సహకారం, ప్రోత్సాహం తనలో మనోధైర్యాన్ని మరింత పెంచాయని వివరించారు.
ఈ ప్రయాణంలో సహాయం అందించినందుకు భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా దళాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మదన్ సింగ్. ఈ ప్రయాణంలో తనకు హిందువులే కాకుండా వేరే వారు కూడా సహాయం చేస్తున్నారని చెప్పారు. తనను అన్ని విధాలా ప్రోత్సహించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇది మత సామరస్యం, సోదరభావం, మానవత్వానికి ఒక గొప్ప ఉదాహరణని కొనియాడారు. కేవలం పవిత్ర స్థలాలను సందర్శించడమే కాకుండా ప్రజలలో ప్రేమ, శాంతి, సోదరభావాన్ని వ్యాప్తి చేయడం కూడా తన లక్ష్యమని స్పష్టం చేశారు. యువత తమ తల్లిదండ్రుల మాట వినాలని, వారి కోరికలకు వ్యతిరేకంగా నడుచుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మదన్ సింగ్ చేపట్టిన ఈ సుదీర్ఘ పాదయాత్ర భక్తి, విశ్వాసం, మానవ సంబంధాలకు ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తోంది. ప్రతి మైలు ప్రయాణం తర్వాత ఆయన నూతనోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే క్రమంలో రాంబన్ జిల్లాలో ఉన్నారు.





