News

తిరుమల శ్రీవారి గరుడసేవకు చెన్నై గొడుగులు

286views

తిరుమల బ్రహ్మోత్సవాల్లో గొడుగులకు చాలా ప్రత్యేకత ఉంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడసేవ చాలా ముఖ్యమైనది. పూర్వకాలం నుంచి నేటి వరకు గరుడసేవ కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్దలతో శ్రీవారిని పూజిస్తుంటారు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల్లో ఏ రోజులేని భక్తుల రద్ది గరుడసేవ రోజు ఉంటుంది. శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులను ఊరేగింపుగా గురువారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్‌.ఆర్‌.గోపాల్‌జీ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

శ్రీవారి ఆల‌యం ముందు చెన్నై నుంచి తీసుకు వచ్చిన ఈ గొడుగుల‌ను టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డికి అందించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడసేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు.

చెన్నైలోని చెన్నకేశవ పెరుమాళ్ ఆలయంలో ఈ గొడుగులకు ప్రత్యేక పూజలు నిర్వహించామ‌న్నారు. సెప్టెంబ‌రు 20వ తేదీన బుధ‌వారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి 2 గొడుగులను సమర్పించిన‌ట్టు గోపాల్ జీ చెప్పారు. గత 19 సంవత్సరాలుగా తిరుమల శ్రీవారికి గరుడ సేవ నాడు అలంకరించడానికి శ్రీవారికి గొడుగులు స‌మ‌ర్పిస్తున్నామని గోపాల్ జీ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో లోక‌నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.