
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల వచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే వందేభారత్ రైలు నడపనుంది. ఈ నెల 8వ తేదీ నుంచి సికింద్రాబాద్- తిరుపతి మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. సికింద్రాబాద్‌లో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు.ఇప్పటికే తెలుగురాష్ట్రాల నడుమ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వందేభారత్ రైలు నడుస్తోంది. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నాలుగు మార్గాలుండగా, వాటిలో సికింద్రాబాద్, నల్గొండ, నడికుడి, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి మార్గంలో అధికారులు వందేభారత్ రైలు ట్రయల్‌రన్ నిర్వహించారు. 661 కిలోమీటర్ల దూరాన్ని 8.30 గంటలలోపు చేరుకునే అవకాశం ఉంది.
కోచ్‌ల వివరాలు: ఈ రైల్లో మొత్తం 16 బోగీలుంటాయి. ఇందులో 14 సాధారణ ఏసీ చైర్‌కార్, రెండు ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లు ఉంటాయి. వాటిలో మొత్తం 1128 మంది ప్రయాణించవచ్చు.
ఛార్జీలు: ఏసీ చైర్‌కార్‌లో ఒకరికి రూ.1610, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లో రూ.3050గా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ మొత్తం ఛార్జీలో భోజనవసతులు కూడా కలిపి నిర్ణయించారని సమాచారం. అయితే ప్రయాణికుడు భోజనం వద్దనుకుంటే మినహాయించుకోవచ్చు.
ఆగే స్టేషన్లు: వందేభారత్ రైలు సికింద్రాబాద్‌లో బయల్దేరితే నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగి తిరుపతికి చేరుతుంది.మొదటి రోజైన శనివారం మాత్రం నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుంది.
వసతులు: సీటు ముందు ల్యాప్‌ట్యాప్ పెట్టుకుని పని చేసుకునేందుకు ఫోల్డ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. సెన్సార్ పద్ధతిలో టచ్ చేస్తే లైట్లు వెలుగుతాయి. బయట నుంచి వేడి రాకుండా కర్టెన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే సమాచారం తెలియజేసేందుకు మైక్‌లు కూడా పొందుపరిచారు. రానున్న రైల్వేస్టేషన్ల సమాచారం ముందుగానే బోర్డులో డిస్‌ప్లే అవుతుంది. ప్రతి కోచ్‌లో ఆర్వో వాటర్ సౌకర్యం ఉంటుంది.
భద్రతకు ప్రాధాన్యం : స్టేషన్ వస్తే తప్ప డోర్లు ఓపెన్ కావు. ఏసీ లోకో పైలెట్ స్విచ్ వేస్తేనే డోర్లు తెరుచుకుంటాయి. ఫస్ట్‌ఎయిడ్ కిట్లు వుంటాయి. అగ్నిప్రమాదాల నివారణ పరికరాలు ప్రతి కోచ్‌లో కూడా ఉంటాయి.





