News

వీర్ సావార్కర్ ను అవమానిస్తే ఊరుకోం.. రాహుల్‌కు ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరిక

191views

‘నా పేరు సావర్కర్ కాదు.. నేను క్షమాపణ చెప్పను’ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీగా అనర్హత వేటు పడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమ దేవుడిని అవమానించడం మానుకోకపోతే తమ కూటమిలో పగుళ్లు వస్తాయని హెచ్చరించారు.

‘ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేం కలిసివస్తున్నామని రాహుల్‌తో చెప్పాలనుకుంటున్నాను. మన బంధానికి బీటలు వారేలా ఎలాంటి ప్రకటనలు చేయొద్దు. మేం సావర్కర్‌ను దేవుడిలా పరిగణిస్తాం. ఆయన్ను అవమానించడం మానుకోవాలి. ఆయన్ను అవమానిస్తే సహించమని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను’ అని ఉద్ధవ్‌ ఘాటుగానే స్పందించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఉద్ధవ్‌ వర్గం శివసేన, ఎన్సీపీ కూటమిగా ఉన్నాయి.

అలాగే ఉద్ధవ్‌ వర్గానికి చెందిన సామ్నా కూడా ఈ విధంగానే సంపాదకీయం రాసింది. ‘రాహుల్‌కు జరిగింది అన్యాయమే. అయితే ,సావర్కర్‌ను అవమానించి, సత్యం కోసం జరిగే పోరాటంలో విజయం సాధించలేరు’ అని వ్యాఖ్యానించింది. ‘ నా పేరు సావర్కర్‌ కాదు.. అందువల్ల ఎవరికీ క్షమాపణలు చెప్పను. నేను నిజాన్నే నమ్ముతా. దాన్నే మాట్లాడతా. ఈ అనర్హతలు నన్నేం చేయలేవు. నా పేరు గాంధీ. గాంధీలు ఎప్పుడూ క్షమాపణలు చెప్పరు’ అంటూ శనివారం రాహుల్‌ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతి తెలిసిందే.