
అరుణాచల్ రాజధాని ఈటానగర్‌లో ‘రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్’ అనే అంశంపై శని, ఆదివారాల్లో జీ-20 సమావేశం జరిగింది. భారత అధికారులతో పాటు జీ-20 దేశాలకు చెందిన దాదాపు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే, చైనా నుంచి ఒక్క ప్రతినిధి కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదని అరుణాచల్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ సమావేశాన్ని చాలా గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. మీడియా కవరేజ్‌కు కూడా అనుమతినివ్వలేదు. అయితే, సమావేశం తర్వాత ఆ ఫొటోలను అరుణాచల్ ప్రభుత్వ మీడియా ప్రతినిధి ట్విటర్‌లో షేర్ చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ టిబెట్‌లో భాగమని చైనా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే డ్రాగన్ వ్యాఖ్యలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అరుణాచల్ తమ అంతర్భాగమేనని చైనాకు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అరుణాచల్‌లో జరిగిన జీ-20 సమావేశాలకు చైనా దూరంగా ఉండటం చర్చనీయాశంగా మారింది. అయితే దీనిపై ఇటు భారత విదేశాంగ శాఖ గానీ.. అటు చైనా గానీ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. ఈ సమావేశంపై చైనా అధికారికంగా అభ్యంతరాలు లేవనెత్తిందా లేదా అనేదానిపై కూడా స్పష్టత లేదు.
జీ-20 బృందానికి ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరులో దిల్లీ వేదికగా జీ-20 దేశాధినేతల ప్రధాన సదస్సు జరగనుంది. ఆ భేటీకి ముందు దేశవ్యాప్తంగా 50 ప్రధాన నగరాల్లో పలు రంగాలు, అంశాలపై జీ-20 సమావేశాలు జరుగుతున్నాయి.




