
దేశంలోని హైవేలు 2024కల్లా అమెరికాతో సమానంగా ఉంటాయని, గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలు, రైలు వంతెనలను శరవేగంగా పూర్తి చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
భారత్‌మాల-2కు త్వరలో కేంద్ర కేబినెట్ ఆమోదం లభించనుందని చెప్పారు. “ఈ ఏడాది రూ.16,000 కోట్లతో రైలు వంతెనలను నిర్మించనున్నాం. ఐదేళ్లలో ఆ బడ్జెట్‌ను రూ.50,000 కోట్లకు పెంచుతాం.
పితోర్‌గఢ్ మీదుగా కైలాశ్ మానస సరోవర్‌కు చేపట్టిన హైవే నిర్మాణం 93 శాతం పూర్తయింది. భారత్‌మాల-2 కింద 5,000 కిలోమీటర్ల హైవేలను తొలుత నిర్మిస్తాం. మొత్తం ఈ ప్రాజెక్టు కింద 35,000 కిలోమీటర్లను నిర్మించాలనేది లక్ష్యం. దీనిద్వారా 580 జిల్లాలను అనుసంధానం చేయనున్నాం. 600 జిల్లాల మధ్య రాకపోకలపై సాంకేతికంగా అధ్యయనం చేసి కారిడార్లను చేపడుతున్నాం. ఝార్ఖండ్‌లో రూ.70,000 కోట్లతో 7 గ్రీన్‌ఫీల్డ్ హైవేలను నిర్మిస్తున్నాం’ అని గడ్కరీ వెల్లడించారు.




