
ఉగ్రదాడులతో శ్రీలంక అట్టుడుకుతోంది. ఈస్టర్ సండే తర్వాత.. ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట శ్రీలంకలో బాంబు బ్లాస్ట్ లు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వారు భారత్ లోకి అడుగుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం 19 మంది ఉగ్రవాదులు సముద్రమార్గంలో ప్రయాణించి భారత్ కు చేరుకున్నారని కేంద్ర నిఘా సంస్థ (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ వార్తలు బయటకు రాగానే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరిలో హై అలర్ట్ కొనసాగుతోంది.
19 మంది ఉగ్రవాదులు సముద్రమార్గంలో ప్రయాణించి తమిళనాడు రాష్ట్రం రామాంతపూర్ వద్ద భారత్ భూభాగంలోకి అడుగుపెట్టారని ఐబీ తెలిపింది. వీరు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 19 చోట్ల పేలుళ్లకు కుట్రపన్నారని ఐబీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం కర్ణాటక రాజధాని బెంగళూరు, చారిత్రక పర్యాటక ప్రాంతం మైసూరు నగరాలని ఓ లారీ డ్రైవర్ సమాచారం అందించినట్టు కర్ణాటక డీజీపీ దక్షిణాది రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. భారత్ లో కూడా శ్రీలంక తరహా ఉగ్రదాడులు చేపట్టాలని తీవ్రవాదులు భావిస్తూ ఉన్నారు.





