ArticlesNews

ఈవీఎంల కొనుగోళ్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. సుమారు 1300 కోట్లు కేటాయింపు!

331views

భారత్‌లో ఎన్నికల నిర్వహణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నారు. అయితే ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగిందని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయినా కేంద్రం వాటిని పట్టించుకోవట్లేదు.. ఇదే టెక్నాలజీతోనే ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యింది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశంలో మరిన్ని ఈవీఎంలు కావాలనీ ఉన్నవాటిలో కొన్ని సరిగా పనిచేయట్లేదని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో స్పందించిన కేంద్రం మరిన్ని ఈవీఎంలను కొనేందుకు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సంవత్సరం 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌ సహా కొన్ని రాష్ట్రాలతోపాటూ.. లోక్‌సభకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ఎన్నికల సంఘం ప్రతిపాదనను ఒప్పుకుంటూ… కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు కేంద్రం ప్రతిపాదనలు పంపింది.

 

ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈవీఎంలనే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నుంచి కొత్తవాటిని కొనబోతోంది. ఇందుకోసం రూ.1,300 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇండియాలో 1982లో తొలిసారిగా ఈవీఎంలను పరిచయం చేశారు. అప్పటి నుంచి వీటిని వినియోగిస్తూ వస్తున్నారు. ఈవీఎంల రాకతో.. ఇండియాలో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇదివరకు నాలుగైదు రోజులకు వచ్చే ఎన్నికల ఫలితాలు.. ఇప్పుడు ఒక్కరోజులోనే వస్తున్నాయి. ఓటింగ్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఈవీఎంల పుణ్యమా అని బ్యాలెట్ పేపర్ వాడకం బాగా తగ్గింది. తద్వారా వృక్షాల నరికివేతకు బ్రేక్ పడింది. ఈవీఎంలను తీసుకెళ్లడం, స్టోర్ చెయ్యడం అన్నీ తేలిగ్గా జరుగుతున్నాయి. ఈవీఎం కారణంగా.. బోగస్ ఓట్లు పడే అవకాశాలు లేవు. ప్రతి ఓటుకూ విలువ వస్తుంది. వీటిని ట్యాంపరింగ్ చేయడం అంత ఈజీ కాదని నిపుణులు చెబుతున్నారు. తమ ఓటు నిజంగా పడిందో లేదో అనే అనుమానం ఓటర్లకు కలుగుతోందని పలువురిని నుంచి అనుమానాలు వ్యక్తం కాగా.. ఈ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు ఓటు వేసిన తర్వాత.. వేసినట్లుగా నిర్ధారించే స్లిప్ సిస్టం ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్‌. దీంతో ఇకపై జరిగే అన్ని ఎన్నికలు ఈవీఎంలతోనే జరపనుందని క్లారిటీ వచ్చేసింది. కొత్త ఈవీఎంల కొనుగోలు చేయడంతో.. ఈసారి మొరాయించే యంత్రాల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. అందువల్ల త్వరలో జరిగే ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని భావించవచ్చు.