News

భారత్‌లో 5G ఫోన్లకు ఫుల్ డిమాండ్… కొనుగోళ్లు ఎలా ఉన్నాయంటే?

281views

అల్ట్రా స్పీడ్ మొబైల్నెట్‌వర్క్ అయిన 5జీ (5G Network) గతేడాది భారతదేశం (India)లోని కొన్ని నగరాల్లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయం నుంచి ప్రముఖ దేశీయ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్ (Airtel), జియో (Jio) 5G సేవలను దేశ వ్యాప్తంగా క్రమంగా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ ఫాస్ట్ డేటా స్పీడ్, లో లేటెన్సీ పొందేందుకు చాలామంది ఇండియన్లు 4G నుంచి 5G ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. కొత్తగా ఫోన్లు కొనే వారందరూ 5G మొబైల్స్ మాత్రమే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల నడుమ భారతదేశ 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2023 చివరి నాటికి 70% పైగా పెరుగుతుందని సైబర్‌మీడియా రీసెర్చ్ (CMR) లేటెస్ట్ రిపోర్టు అంచనా వేసింది. 5G ఫోన్లకు దేశంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్ చూస్తుంటే 70% మార్కెట్ పెరుగుదల అసాధ్యం ఏమీ కాదని చెప్పవచ్చు.

* పెరిగిన షిప్‌మెంట్స్

2020లో 5జీ నెట్‌వర్క్ ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు 13 రెట్లు పెరిగాయి. దీనికి కారణం దేశంలో 5జీ నెట్‌వర్క్ శరవేగంగా విస్తరించడం, 5G మొబైల్ ఫోన్లకు అధిక డిమాండ్ నెలకొనడం అని చెప్పవచ్చు. నిజానికి భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ వాటా 2020లో కేవలం 4% మాత్రమే ఉంది. అయితే ఈ మార్కెట్ వాటా 2023లో 45% కంటే ఎక్కువగా పెరుగుతుందని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (IIG), సైబర్ మీడియా రీసెర్చ్ (CMR) అనలిస్ట్ మెంక కుమారి పేర్కొన్నారు.

ఆమె ప్రకారం, 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2020లో ప్రవేశపెట్టిన సంవత్సరం నుంచి గణనీయంగా వృద్ధి చెందింది. అంటే భారతదేశంలో 5G స్మార్ట్‌ఫోన్‌ల స్వీకరణ వేగంగా పెరుగుతోంది. ఇది రాబోయే కొన్ని సంవత్సరాలలో మరింత వృద్ధి చెందుతుందని చెప్పవచ్చు.