
భారత్‌కు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో రోజు రోజుకీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం అవి 5.8 బిలియన్ డాలర్లకు తగ్గి ఎనిమిదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరింది. ఇవి మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వెల్లడిస్తోంది. దీనిపై ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి ఇషాద్ మాట్లాడుతూ.. తమ దేశం దివాళా తీయదని, ఇమ్రాన్‌ఖాన్ తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుత పరిణామాలకు కారణమని చెబుతున్నారు. అయితే ఆర్థిక నిపుణుల అంచనాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. పాక్ ఆర్థిక వ్యవస్థ దివాళాకు దగ్గరగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గోధుమ పిండి కోసం తొక్కిసలాట..
ఇక అక్కడ గోధుమల కొరత వల్ల అందరికి పిండి అందుబాటులో ఉండటం లేదు, సబ్సిడీలో లభించే గోధుమ పిండి కోసం వేలాది మంది ప్రజలు గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. దాంతో , సింధ్, బలూచిస్థాన్, తదితర ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగినట్లు వార్తలు వచ్చాయి. రేషన్ దుకాణాల వద్ద తోపులాటలు సర్వసాధారణమైనట్లు ఓ మీడియా కథనం పేర్కొంది. భద్రతా బలగాల పహారాలో పిండిని పంపిణీ చేసేందుకు వాహనాలు వస్తున్నాయి. వాటి చుట్టూ జరిగే తోపులాటలు తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఉద్రిక్తతల కారణంగా కొందరు ప్రాణాపాయ స్థితిలోకి జారుకుంటున్నారు. ఇటీవల సింధ్ ప్రావిన్స్లోని ఒక దుకాణంలో పిండి తక్కువగా ఉండటంతో తొక్కిసలాట జరిగింది. దాంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. తన ఆరుగురు సంతానం ఆకలి తీర్చేందుకు ప్రయత్నించి చివరికి ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది.
ఆకాశన్నంటుతున్న ధరలు..
ఈ సంక్షోభం వేళ.. గోధుమలు, పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ పిండికి రూ.150కి పైగా చెల్లించాల్సి వస్తోంది. మరో వైపు ఇదే అదనుగా మిల్లు యజమానులు ధరలు పెంచుతున్నారు. కొన్నిచోట్ల 20 కేజీల పిండి ధర రూ.3,000కు చేరుకుంది. పాక్ చరిత్రలోనే ధరలు ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. బలుచిస్థాన్లో గోధుమల నిల్వలు నిండుకున్నాయని, తక్షణమే 4,00,000 బస్తాలు కావాలని అక్కడి మంత్రి వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుత ఆహార సంక్షోభానికి గతేడాది వరదలు కూడా కారణం, పాక్ చరిత్రలోనే అవి అత్యంత దారుణమైన వరదలని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంక) పేర్కొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయరంగం కుదేలయ్యింది.





