
జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ మూలవిరాట్ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో కనిపించడంతో కలకలం సృష్టిస్తోంది. దుర్గమ్మ అంతరాలయాన్ని చరవాణితో చిత్రీకరించి సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయడంతో ఆలయ అంతర్గత భద్రత వైఫల్యాలను బహిర్గతం చేసినట్లు అయ్యింది. అమ్మవారి సన్నిధిలోకి సెల్‌ఫోన్ల అనుమతి లేకపోయినా దృశ్యాలను చిత్రీకరించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌టీఎఫ్ భద్రత, ప్రైవేటు సెక్యూరిటీ, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ దృశ్యాల చిత్రీకరణకు ఎందుకు సాహసిస్తున్నారు? అప్పుడు నియంత్రించాల్సిన భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు పెద్దఎత్తున ఉత్పన్నమవుతున్నాయి. వీవీఐపీలు, ముఖ్యుల వెంట వారికి సహాయకులుగా వస్తోన్న వారి ఫోన్లను భద్రతా సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. అలాగే టిక్కెట్లు కొనుగోలు చేసి వస్తోన్న భక్తులను రద్దీ సమయంలో అదుపు చేయడంలోనూ భద్రతా సిబ్బంది వైఫల్యం చెందుతున్నారు. అమ్మవారి ఆలయాన్ని సందర్శించి తమ మొక్కులు చెల్లించుకునేందుకు కొన్నినెలల క్రితం ఓ సినిమా నటుడు వచ్చిన సమయంలో అభిమానులు అమ్మవారి ఆలయంలోని హుండీలపై నిల్చుని మరీ చరవాణిలో దృశ్యాలు బంధించారు. ఆ తర్వాత దేవస్థానం తక్షణ చర్యలుగా ఆలయంలో సంప్రోక్షణతోపాటు ఇతర వైదిక కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది.
వీడియో చిత్రీకరణపై పోలీసులకు ఫిర్యాదు…
నిబంధనలకు విరుద్ధంగా అమ్మవారి మూలవిరాట్ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో తిరుగుతున్నట్లు వీడియోతో సహా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో ధర్భముళ్ల భ్రమరాంబ దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా దృశ్యాలు చిత్రీకరించింది ఎవరు? ఎప్పుడు తీశారు? అనే విషయాలపై ఆరా తీయించారు. శాంతకుమారి అనే భక్తురాలు ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లుగా గుర్తించామని ఈవో భ్రమరాంబ తెలిపారు. డిసెంబర్ 22వ తేదీ ఉదయం 9 గంటల 52 నిమిషాలకు వాటిని చిత్రీకరించినట్లు తేలిందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఈవో…. నిబంధనలకు విరుద్ధంగా వీడియో చిత్రీకరణపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దుర్గగుడిలోని సెక్యూరిటీ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు.





