
కాబూల్: తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గాన్‌లో మహిళలపై అణచివేతకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలు నేరాలకు సంబంధించి మహిళలతో సహా మొత్తం 19 మందికి కొరడా దెబ్బలతో బహిరంగంగా శిక్షించినట్టు తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని అక్కడి అధికారి వెల్లడించారు. షరియాకు లోబడే ఈ శిక్ష అమలు చేసినట్టు తాలిబన్లు సమర్థించుకున్నారు.
ఈశాన్య ప్రాంతమైన తఖార్ ప్రావిన్సులోని తలూఖన్ నగరంలో మొత్తం 19 మందికి కొరడా దెబ్బలు విధించగా.. అందులో 10మంది పురుషులు, తొమ్మిది మంది మహిళలు ఉన్నట్టు అధికారి అబ్దుల్ రహీం రషీద్ వెల్లడించారు. నవంబర్ 11న మత పెద్దలు, విద్యావంతులు, స్థానికుల సమక్షంలోనే ఈ శిక్ష అమలు చేశామన్నారు. గతేడాది ఆగస్టులో అఫ్గాన్‌ను వశం చేసుకున్న తర్వాత.. కొరడా దెబ్బలతో శిక్షించినట్టు తాలిబన్లు అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాలిబన్ల అరాచకాలపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.



