
గాంధీనగర్: గుజరాత్‌లోని మోర్బీలో పెను విషాదం జరిగింది. అక్కడి మచ్చు నదిపై వందేళ్ళ క్రితం ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో కట్టిన బ్రిడ్జి ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కూలిపోవడంతో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గల్లంతయ్యారు. ఈత వచ్చిన వారు మాత్రం ఆ చీకట్లోనే.. ప్రాణాలు అరచేత పెట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
బ్రిడ్జి కూలే సమయానికి దానిపై 500 మందికి పైగా ప్రజలు ఉన్నట్టు సమాచారం. 177 మందిని సురక్షితంగా కాపాడారు. 230 మీటర్ల పొడవుండే ఈ తీగల వంతెన చాలా పాతది కావడంతో తరచుగా మరమ్మతులు చేయాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఆరునెలల క్రితం దీన్ని మూసివేసి మరమ్మతులు నిర్వహించారు.
గుజరాతీల ఉగాది సందర్భంగా అక్టోబరు 26న పునరుద్ధరించి మళ్ళీ ప్రజల రాకపోకలకు అనుమతిచ్చారు. ఆరు నెలల తర్వాత తెరవడం, ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సామర్థ్యానికి మించి పర్యాటకులు వంతెనపై నిలబడటంతోనే కూలినట్టు అధికారులు భావిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఇతర రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్సుల్లో సమీప దవాఖానలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని డీజీపీ అశిష్ భాటియా పేర్కొన్నారు.
ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 3 ప్లాటూన్ల ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, భారత నౌకా, వైమానిక దళ, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయకచర్యల్లో పాల్గొన్నారు. వీరంతా కలిసి దాదాపు 150 మంది ప్రాణాలు కాపాడినట్టు సమాచారం.
Source: Nijamtoday





