News

చైనాలో కంచెలు దూకి పారిపోతున్న ఉద్యోగులు!

405views

బీజింగ్‌: చైనా కొవిడ్ జీరో పాలసీ ఆ దేశ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అక్కడివారు లాక్‌డౌన్ పేరు వింటేనే వణికిపోతున్నారు. కొవిడ్ ఆంక్షలను తప్పించుకునేందుకు జెంగ్‌ఝౌలోని అతిపెద్ద ఫ్యాక్టరీ నుంచి సిబ్బంది..ఫెన్సింగ్ దూకి బయటకు వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకివచ్చాయి.

వారంతా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వస్థలాలకు కాలినడకనే వెళ్తున్నట్టు సమాచారం . చైనా మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వారంతా ఫాక్స్‌కాన్ సిబ్బంది అని తెలుస్తోంది. ‘జెంగ్‌ఝౌ నగరంలో అతిపెద్ద ఐఫోన్‌ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు కంచెలు దూకుతున్నారు. అక్కడి నుంచి దొంగచాటుగా బయటపడి, పారిపోతున్నారు’ అంటూ ఓ నెటిజన్‌ వీడియో షేర్ చేశారు.

హెనాన్‌ జెంగ్‌ఝౌలో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్ ఉంది. దానిలో యాపిల్ ఉత్పత్తులు అసెంబుల్‌ చేస్తారు. అందులో తాజాగా విడుదలైన ఐఫోన్‌ 14 పరికరాలు కూడా ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలో కొవిడ్ కేసులు వెలుగుచూడడంతో పలువురు సిబ్బందిని ఫాక్స్‌కాన్ సంస్థ క్వారంటైన్‌లో ఉంచిందని వార్తలు వచ్చాయి. ఉద్యోగుల సంచారంపై కఠిన ఆంక్షలు విధించినట్టు కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత నుంచి కంచెలు దూకిన దృశ్యాలు బయటకువచ్చాయి. ఈ ఫాక్స్‌కాన్ కేంద్రం 3,50,000 మందికి ఉపాధి కల్పించగలదు. అయితే, ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారో తెలీదు. అలాగే ఆ కేంద్రంలోని 20 వేల మందికి వైరస్‌ సోకిందన్న వార్తలను ఫాక్స్‌కాన్‌ తోసిపుచ్చింది. ఈ వీడియోలు వెలుగులోకి రావడంతో ఇంటికి వెళ్ళాలనుకునే ఉద్యోగుల కోసం సంస్థ, ప్రభుత్వ యంత్రాంగం వాహనాలను ఏర్పాటు చేసింది.

30 శాతం తగ్గనున్న యాపిల్ ఉత్పత్తి..!

చైనా కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేయడంతో యాపిల్‌ ఐ ఫోన్ల ఉత్పత్తి వచ్చే నెలలో దాదాపు 30 శాతం పడిపోవచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి షెన్‌జెన్‌ నగరంలోని మరో కేంద్రంలో ఉత్పత్తిని పెంచనున్నట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ తయారీదారులకు అత్యంత కీలకమైన సెలవుల సీజన్‌లో ఈ ఆంక్షలు రావడంతో ఉత్పత్తిపై ప్రభావం పడనుంది. దీనిపై ఫాక్స్‌కాన్‌ స్పందించింది. లోటును భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి