
జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. కొత్త జాబితాలో మొత్తం 384 ఔషధాలున్నాయి. ఇందులో ఐవర్‌మెక్టిన్ లాంటి యాంటీ ఇన్ఫెక్టివ్ లతో పాటు 34 మందులను కొత్తగా చేర్చారు. ఇక రనిటైడిన్ సహా 26 ఔషధాలను అత్యవసర మందుల జాబితా నుంచి తొలగించారు. ప్రముఖ యాంటాసిడ్ అయిన రనిటైడిన్ ను తొలగించడంతో ఇకపై జిన్ టాక్, రాంటాక్ వంటి ట్యాబ్లెట్లు అత్యవసర మందుల జాబితాలో కనిపించవు.
జాతీయ అత్యవసర ఔషధాల జాబితా 2022ను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ విడుదల చేశారు. మొత్తం 27 కేటగిరీల్లో 384 మందులతో కొత్త జాబితా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ జాబితాలోకి చేర్చడం వల్ల పలు యాంటీబయోటిక్‌లు, వ్యాక్సిన్లు, క్యాన్సర్ నిరోధక మందులు వంటి కీలక ఔషధాల ధరలు అందుబాటులోకి రానున్నాయని, రోగులకు మందుల ఖర్చు తగ్గుతుందని మాండవీయ వెల్లడించారు.
ఎండోక్రైన్ మందులు, ఇన్సులిన్ గ్లార్గిన్, ఐవర్‌మెక్టిన్ వంటి 34 రకాల ఔషధాలను కొత్తగా జాబితాలో చేర్చారు. రనిటైడిన్, సక్రాల్‌ఫేట్, అటినోలాల్ వంటి 26 రకాల ఔషధాలను తొలగించారు. మందుల ధరలు, ఉత్తమ ఔషధాల లభ్యత తదితర కారణాలతో ఈ మందులను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2015 తర్వాత జాతీయ అత్యవసర ఔషధాల జాబితాను అప్‌డేట్ చేయడం మళ్లీ ఇప్పుడే. 350 మందికి పైగా నిపుణులతో 140 సార్లు చర్చలు జరిపి ఈ జాబితాను తయారుచేసినట్లు కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.





