
* వేదాంత, తైవాన్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం
* ప్రధాని మోడీ నాయకత్వంలో కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యం
గనుల దిగ్గజం వేదాంత, తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్ కాన్ కలిసి దేశంలో తొలి సెమీకండక్టర్ ప్లాంటును రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్ లో నిర్మించనున్నారు. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అహ్మదాబాద్ జిల్లాలో 1000 ఎకరాల భూమిలో సెమీకండక్టర్ ఫ్యాబ్ యూనిట్, డిస్ ప్లే ఫ్యాబ్ యూనిట్, సెమీకండక్టర్ అసెంబ్లింగ్ - టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఇందు కోసం వేదాంత – ఫాక్స్ కాన్ లు 60:40 నిష్పత్తిలో ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేస్తాయి. ‘రెండేళ్లలో ఈ ప్లాంటులో ఉత్పత్తి మొదలవుతుంద’ని వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ‘ప్రారంభ దశలో గుజరాత్ యూనిట్‌లో నెలకు 40,000 వేఫర్లు ( సర్క్యూట్‌లో వాడతారు) 60,000 ప్యానెళ్లను తయారు చేస్తామ’న్నారు.
కోటి ఉద్యోగాలు లక్ష్యం
దుబాయ్ కి చెందిన నెక్ట్స్‌ఆర్బిట్, ఇజ్రాయిల్ కు చెందిన టవర్ సెమీకండక్టర్లు కలిసి కర్ణాటకలోని మైసూరులో సెమీ కండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేస్తాయి. సింగపూర్ కు చెందిన ఐజీఎస్‌ఎస్ వెంచర్ తమిళనాడులో యూనిట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ‘ప్రధాని మోడీ నాయకత్వంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాం. ఇపుడు ఆ సంఖ్యను కోటికి తీసుకెళ్లాలన్నదే మా లక్ష్యం. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిని ప్రస్తుత 80 బిలియన్ డాలర్ల (రూ.6 లక్షల కోట్లు) నుంచి 300 బిలియన్ డాలర్ల (రూ.25 లక్షల కోట్ల)కు తీసుకెళ్లడంపై పనిచేస్తున్నామ’ని ఎమ్‌ఓయూ కార్యక్రమంలో ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.





