
2007 వ సంవత్సరంలో జరిగిన సంజౌతా ఎక్స్ప్రెస్ కేసులో అనుమానితులుగా వున్న స్వామి అసీమానంద, మరో ముగ్గుర్ని NIA ప్రత్యేక న్యాయస్థానం నేడు నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ అనుమానితులు స్వామి అసీమానంద, లోకేష్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌదరిలకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు చూపలేక పోయిన కారణంగా వారిని విడుదల చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించినట్లు డిఫెన్సు న్యాయవాది ముఖేష్ గార్గ్ వివరించారు.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షినని చెప్పుకుంటున్న పాకిస్తానీ వనిత పిటిషన్ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది.
కాగా 2007 ఫిబ్రవరి 18న భారత్ పాకిస్తాన్ల మధ్య నడిచే సంజౌతా ఎక్స్ప్రెస్ లో హర్యానాలోని పానిపట్ వద్ద పేలుడు చోటు చేసుకుంది. ఆ పేలుడులో షుమారు 68 మంది మృతి చెందారు. వారిలో 33 మంది పురుషులు, 19 మంది మహిళలు, 16గురు పిల్లలు వున్నారు. తర్వాత అందులో రెండు పేలని బాంబులను కూడా NIA స్వాధీనం చేసుకున్నది.
హిందూ ప్రార్ధనా మందిరాలపై ఇస్లామిక్ తీవ్రవాదులు చేసిన వరుస దాడులకు ప్రతిగా స్వామి అసీమానంద సాయంతో రాజేంద్ర చౌదరి మరికొందరితో కలిసి సంజౌతా ఎక్స్ప్రెస్, మక్కా మసీద్, అజ్మీర్ షరీఫ్ దర్గా వంటి చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లుగా ఆరోపణలు ఎదుర్కున్నారు. పన్నెండేళ్ళ సుదీర్ఘ విచారణ తర్వాత వారు నిర్దోషులుగా విడుదలవడం గమనార్హం.





