News

దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీమాత ఆశీర్వాదాలు: మోదీ

496views

న్యూఢిల్లీ: దేశంలో కాళీమాత వివాదం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై కాళీమాత అపరిమితమైన ఆశీస్సులున్నాయని చెబుతూ ఇదే ఆధ్యాత్మిక శక్తితో విశ్వకళ్యాణం కోసం భారత్ ముందడుగు వేస్తోందని తెలిపారు. కాళీమాతను బెంగాల్‌లోనే కాదు దేశం మొత్తం పూజిస్తుందని పేర్కొన్నారు.

స్వామి ఆత్మస్థానంద శత జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడిన మోదీ రామకృష్ట పరమహంస కూడా కాళీమాతను ఆరాధించేవారని గుర్తు చేశారు. రామకృష్ణ మఠం 15వ అధ్యక్షుడిగా స్వామి ఆత్మస్థానంద పనిచేశారు. స్వామి రామకృష్ణ పరమహంస ఓ సన్యాసి. స్వయంగా తన కళ్ళ‌ ముందు కాళికా అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకున్నారు.

కాగా, కాళీమాత తన దృష్టిలో మాంసం తిని, మ‌ద్యం తాగే దేవత అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ వివాదాస్పద సినిమా పోస్టర్‌పై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాళీమాతను అవమానించేలా మాట్లాడిన మహువాను టీఎంసీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.

ఆమె మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గలేదు. హిందూ ధర్మాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా? కాళీమాతను ఎలా పూజించాలో వాళ్ళు చెప్పడమేంటి అని ప్రశ్నించారు. బెంగాల్‌లో సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో కాళీమాత అంశంపై మోదీ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఆయన సినిమా పోస్టర్‌పై గాని, టీఎంసీ ఎంపీ పేరును గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, బెంగాలీ ప్రజలు కాళికామాతను ఆరాధించడాన్ని కూడా ప్రధాని ప్రస్తావించడం ద్వారా కాళికామాత పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్న వారికి ప్రధాని పరోక్ష హెచ్చరిక పంపినట్టయింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి