
న్యూఢిల్లీ: అగ్నిపథ్‌లో భాగంగా నావికాదళంలో చేరేందుకు దాదాపు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిసారిగా నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. అగ్నివీర్ పథకంలో భాగంగా సెయిలర్ల కోసం మహిళల నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది.
అవసరమైతే వారికి యుద్ధనౌకల్లోనూ విధులకు పంపనున్నట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే జులై 1న నేవీలో అగ్నివీరుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవ్వగా.. 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, మొత్తం ఎన్ని రిజిస్ట్రేషన్లు వచ్చాయన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం నేవీలో అగ్నివీరుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జులై 15 నుంచి 30 వరకు అప్లికేషన్లను తీసుకోనున్నారు. అక్టోబరులో రాత పరీక్ష, శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించి నవంబరు నుంచి శిక్షణ ప్రారంభించనున్నారు.





