
-
అశ్లీల పోస్టులు పెడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం
-
పోలీసులకు దేవస్థానం అధికారుల ఫిర్యాదు
భద్రాద్రి: చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఇతరుల మనోభావాలను కించపర్చాలనుకునే పోకిరీల విపరీత చేష్టలకు హద్దూ పొద్దూ లేకుండా పోతోంది. ఏకంగా భద్రాద్రి రాముడి పేరుతోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్య, అశ్లీలకరమైన దృశ్యాలను పోస్ట్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఐటీ నిపుణుల సాయంతో ఆ అకౌంట్‌ను బ్లాక్ చేయించినా కూడా ఆ పోకిరి గంటలోనే మళ్ళీ యాక్టివేట్ చేసుకుని.. పోస్టింగ్‌లు చేస్తూండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
రాముడి ఆలయం పేరుతోనే ఫేక్ అకౌంటా?
భద్రాద్రి రామాలయం పేరుతో ఫేస్‌బుక్‌లో ఇటీవల ఓ అకౌంట్ క్రియేట్ అయింది. ఎవరైనా రాములవారి ఆలయ సమాచారాన్ని తెలుసుకోవాలంటే.. ఎక్కువగా సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్న కాలం ఇది. ఇలాంటి సమయంలో భద్రాద్రి రాముని ఆలయం పేరు మీద క్రియేట్ అయిన అకౌంట్‌లో ఆ వివరాలు లేకపోగా.. పోర్న్ సైట్ లింక్స్ తో పాటు అసభ్యకరమైన మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈనెల అయిదోతేదీ నుండి ఫేస్బుక్ అకౌంట్ లో అశ్లీల చిత్రాలు పోస్ట్ చేయడం వాటిని సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడాన్ని భక్తులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులకు చేరవేయడంతో హుటాహుటిని పోలీసులకు ఫిర్యాదు చేశారు.





