
ఆపద సమయంలో భారత్ శ్రీలంకకు భారీ సాయం చేసింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు మన దేశం మరోసారి ఆపన్న హస్తం అందించింది. ద్వీప దేశంలో ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్ టన్నుల డీజిల్ ను శ్రీలంకకు సరఫరా చేసినట్లు భారత్ తెలిపింది.
విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగుంటడంతో శ్రీలంకలో కరెన్సీ విలువ తగ్గింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఇంధనం దిగుమతి చేసుకునేందుకు వీలుగా భారత్ గత నెలలో శ్రీలంకకు అదనంగా 500 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ను పొడగించింది. ఈ మేరకు ఫ్రిబవరి 2, 2022న పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోలు కోసం ఇరుదేశాలూ క్రెడిట్ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఈ నెల 23న భారత్ నుంచి శ్రీలంకకు 40వేల మెట్రిక్ టన్నుల డీజిల్ ఓ షిప్ లో బయలుదేరింది. ఆ షిప్ సోమవారం సాయంత్రానికి కొలంబోకు చేరిందని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత శ్రీలంక ఇంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవటం ఇదే ప్రధమం. ఫలితంగా ప్రజలు ఇంధనం, వంటగ్యాస్, నిత్యవసరాల కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే విద్యుత్ కోతల కారణంగా నెలల తరబడి జనం ఇక్కట్ల పాలవుతున్నారు. ఈ క్రమంలోనే భారత్ తన ‘నైబర్ హుడ్ ఫస్ట్’ అనే విధానానికి అనుగుణంగా శ్రీలంకకు ఈ ఏడాది 3.5 బిలియన్ డాలర్లకుపైగా విలువైన సహాయాన్ని అందించింది.





