
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గోధుమల ఎగుమతిపై నిషేధాజ్ఞలలో కాస్త సడలింపు నిచ్చింది. గోధుమల కన్‌సైన్‌మెంట్లను పరీక్ష కోసం, సిస్టమ్స్‌లో రిజిస్ట్రేషన్ కోసం కస్టమ్స్‌కు మే 13న లేదా అంతకు ముందు అప్పగించినట్లయితే, అటువంటి కన్‌సైన్‌మెంట్లను ఎగుమతి చేయడానికి అనుమతించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది.
ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈజిప్టునకు వెళ్ళే గోధుమల కన్‌సైన్‌మెంట్‌కు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ కన్‌సైన్‌మెంట్ ఇప్పటికే కాండ్లా నౌకాశ్రయంలో లోడింగ్ అవుతోంది. ఈజిప్టు ప్రభుత్వంతోపాటు, ఈ గోధుమలను ఎగుమతి చేస్తున్న మెసర్స్ మీరా ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజ్ఞప్తి మేరకు ఈ కన్‌సైన్‌మెంట్‌కు అనుమతి ఇచ్చింది. 61,500 మెట్రిక్ టన్నుల గోధుమలను ఈజిప్టునకు ఎగుమతి చేయబోతున్నారు.
ఇతర దేశాల ఆహార భద్రత అవసరాలను దృష్ట్యా ఆయా దేశాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే, ఆ దేశాలకు గోధుమలను ఎగుమతి చేయవచ్చునని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది. అదే విధంగా రద్దు చేయడానికి వీలు కానటువంటి లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఈ నోటిఫికేషన్ జారీ అయిన తేదీన లేదా అంతకు ముందు జారీ చేసినట్లయితే, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సమర్పించి, ఎగుమతి చేయవచ్చునని తెలిపింది.
Source: Nijamtoday





