News

తాజ్ మహల్‎లోని గదుల ఫొటోలు విడుద‌ల‌

520views

ఆగ్రా: తాజ్‌మహల్ లోపల తాళం వేసిన 22 గదుల రహస్యాలపై వివాదం కొనసాగుతోంది. ఈ రభస సాగుతుండగానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరిలో పునరుద్ధరణ పనుల కోసం తెరిచిన ఆ స్మారక చిహ్నంలోని కొన్ని భూగర్భ గదుల చిత్రాలను విడుదల చేసింది. ఈ ఫోటోలను మే అయిదోతేదీన‌ వారి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. వీటిని ఎవరైనా చూడొచ్చని సంబంధిత అధికారులు చెప్పారు.

ఈ సందర్భంగా ఎ.ఎస్.ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ మాట్లాడుతూ డిసెంబర్ 2021 నుంచి మార్చి 2022 మధ్య అధికారులు చేసిన పునరుద్ధరణ పనుల ఫోటోలు ఇప్పుడు ఎ.ఎస్.ఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా చూడవచ్చనని చెప్పారు. గదుల విషయంలో ఎలాంటి రహస్యం దాచాల్సిన అవసరం లేదని, అవి తాజ్ మహల్ నిర్మాణంలో భాగమని ఆయన అన్నారు.

తాజ్ మహల్ నది ఒడ్డున ఉన్న భూగర్భ కణాల నిర్వహణ పనులను కొన్ని నెలల క్రితం చేపట్టామని, పాడైపోయిన, శిథిలమైన సున్నపు ప్లాస్టర్‌ను తొలగించి, మళ్ళీ కొత్తగా వేశామని ఆయన చెప్పారు. కాగా, తాజ్‌మహల్ గదుల్లోని విషయాలపై జరుగుతున్న చర్చకు ముగింపు పలికేందుకు ఈ ఫోటోలను పబ్లిక్ డొమైన్‌లోకి విడుదల చేశారని పర్యాటక పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఆర్కియాలజీ విడుదల చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా, కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్లోని 20 గదులను తెరిచి వాటి రహస్యం బయటపెట్టాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్‌ని బీజేపీకి చెందిన స్థానిక ఇంఛార్జ్ రజనీష్ సింగ్ దాఖలు చేశారు. ఆ గదుల్లో ఏముందో బయటపట్టేలా ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా, ఇతర సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, దీనిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు మీరు మా ఛాంబర్లను చూడ్డానికి అనుమతి అడుగుతారని, దయచేసి ప్రజా ప్రయోజన వాజ్యాల వ్యవస్థను అపహాస్యం చేయవద్దని కోర్టు చెప్పింది. ఈ అంశాన్ని చరిత్రకారులకు వదిలేయాలని సూచించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి