News

సింహాచలంలో మాయమైన స్వామి వారి వజ్రపు ఉంగరం… మంత్రిని కట్టేసిన ఆలయ సిబ్బంది!

578views

సింహాచ‌లం: సింహాచల శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వజ్రాల ఉంగరం మాయమైంది. దీంతో.. గాబరాపడిన ఆలయ సిబ్బంది, పూజారులు, వైదిక సిబ్బంది ఆలయంలో హడావుడి చేశారు. స్వామివారి ఉంగరాన్ని వెతికి పట్టుకునేందుకు అన్నిచోట్లా వెతుకులాడారు. కానీ.. ఎక్కడా లభించకపోవడంతో.. ఆ సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులను తాళ్ళ‌తో కట్టేసి విచారించారు.

రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సినీనటుడు కేదార్‌శంకర్‌ను సైతం దొంగల జాబితాలో చేర్చారు. ఈ హడావుడి చూసిన పలువురు భక్తులు భయంతో పరుగులు తీశారు. అయితే.. ఇదంతా.. స్వామివారి వార్షిక తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా నిర్వహించే.. “ఉంగరపు సేవ” కార్యక్రమంలో భాగమేనని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

శనివారం రాత్రి జరిగిన దొంగల దోపిడీ ఉత్సవానికి కొనసాగింపుగా.. ఆదివారం ఉదయం ఈ “ఉంగరపు సేవ” వేడుకను వినోదాత్మకంగా నిర్వహించారు. చోరీకి గురైన స్వామివారి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని అర్చకులు, సిబ్బంది చక్కగా నిర్వహించారు. రక్షక భటుడిగా అర్చకుడు కరి సీతారామాచార్యులు, విచారణాధికారిగా స్థానాచార్యులు టి.పి.రాజగోపాలాచార్యులు వ్యవహరించారు.

వీరు.. రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను, సినీనటుడు కేదార్‌శంకర్​ను ఇంకా.. ఈవో సూర్యకళ, దేవస్థానం ట్రస్టీలు శ్రీనుబాబు, దినేశ్‌రాజ్‌తోపాటు పలువురు భక్తులను, అధికారులను బంధించి.. చోరీకి గురైన స్వామి వారి ఉంగరాన్ని మీరే తీశారంటూ ప్రశ్నించిన తీరు భక్తులకు వినోదాన్ని పంచింది. ఉత్సవంలో భాగంగా ముత్యాల పల్లకీలో మహారాజా అలంకరణలో ఆశీనులైన స్వామివారి మేలి ముసుగులో బంగారు ఉంగరం దొరకడంతో వినోదోత్సవం ఉత్సాహంగా ముగిసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి