
* హిందూ వ్యతిరేక కార్యకలాపాలు, ముస్లిం తీవ్ర వాదుల తయారీకి పాల్పడుతున్నారని ఆరోపణ
ఇస్లాం మత ప్రబోధకుడు జాకీర్ నాయక్ కు చెందిన ‘ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)’పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై రిటైర్డ్ జస్టిస్ డీఎన్ పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర హోం వ్యవహారాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. జాకీర్ స్థాపించిన ఐఎఫ్ఆర్ పై అనేక ఆరోపణలున్నాయి. జాకీర్ తోపాటు, సంస్థకు చెందిన ఇతర సభ్యులు మతపరమైన విద్వేష కార్యాకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలొచ్చాయి. అలాగే ముస్లింలను తీవ్రవాదులుగా మారాలంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని జాకీర్ పై అభియోగాలున్నాయి. దీంతో మతపరమైన సహనాన్ని పెంపొందించకుండా, విబేధాలు పెంచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని కేంద్రం భావించింది. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఐఆర్ఎఫ్ ను చట్టవ్యతిరేక సంస్థగా గుర్తిస్తూ, కేసులు నమోదు చేసింది. అయితే, ఒక సంస్థను చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటించాలంటే.. దానికోసం ఒక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి, ఆ ట్రిబ్యునల్ ఇచ్చే నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలి. ఈ నిబంధన ప్రకారం కేంద్రం డీఎన్ పటేల్ ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. తాజాగా ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఆర్ఎఫ్ పై కేంద్రం నిషేధం విధించింది.





