
బెంగళూరు: ‘హలాల్’ మాంసాన్ని బహిష్కరించాలని కొన్ని హిందూ సంస్థలు హిందువులకు పిలుపునివ్వడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. హలాల్ మాంసంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.
ఇది(హలాల్ మీట్) ఒక అలవాటుగా మాత్రమే వస్తోందని, దీనిపై ఎవరైనా తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు ఆ అంశాన్ని పరిశీలించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా గ్రూపులు చేస్తున్న డిమాండ్‌పై ప్రభుత్వం అధ్యయనం చేసి, వారు చెబుతున్నది నిజమా కాదా అనేది అంచనా వేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.
రైట్ వింగ్ డిమాండ్ చేసిందా, లెఫ్ట్ వింగ్ డిమాండ్ చేసిందా అనేది తమకు ప్రధానం కాదని, అభివృద్ధి, శాంతి, ప్రజాభద్రత అనేవే ప్రభుత్వానికి ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కాగా, రాష్ట్రంలో హలాల్ మాంసాన్ని బహిష్కరించాలంటూ హిందూ రైట్ వింగ్ గ్రూప్స్ కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి సైతం దీనిపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. హలాల్ ఫుడ్‌ను ‘ఎకనామిక్ జీహాద్’గా ఆయన అభివర్ణించారు.
Source: Nijamtoday





