
న్యూఢిల్లీ: భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రూ. 30 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. భారతీయులంతా స్థానిక ఉత్పత్తుల కోసం డిమాండ్ చేస్తే అవి అంతర్జాతీయం అయ్యేందుకు ఎంతో సమయం పట్టదని తెలిపారు.
గడిచిన ఏడాది కాలంలో ‘గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్(జీఈఎం) ద్వారా ప్రభుత్వం 1.25 లక్షల చిన్న వ్యాపారులు, దుకాణదారుల నుంచి రూ.లక్ష కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసినట్టు చెప్పారు. చిన్నచిన్న వ్యాపారులే నేరుగా ప్రభుత్వానికి అమ్మకాలు జరిపారన్నారు. దేశంలో ఆయుష్ ఉత్పత్తుల మార్కెట్, దానికి సంబంధించిన స్టార్ట్‌పలు పెరగడం సంతోషకరమని ప్రధాని చెప్పారు.
ఆరేళ్ళ కిందట రూ.22 వేల కోట్లుగా ఉన్న ఆయుష్ మార్కెట్ ప్రస్తుతం రూ.1.40 లక్షల కోట్లకు చేరిందన్నారు. నాణ్యమైన ఉత్పత్తులతో ఆయుష్ స్టార్ట్‌పలు ప్రపంచాన్ని ఏలుతాయని, ఆ రోజు త్వరలోనే రానుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.





