News

దినదిన ప్రవర్థమానమ‌వుతున్న జాతీయవాద భావనలు

550views
  • ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

భాగ్య‌న‌గ‌రం: సామాజిక మార్పుతో పాటు వ్యక్తి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ వ్యక్తికంటే దేశం, సమాజం అత్యున్నతమనే భావనను ముందుకు తీసుకువెళుతున్న జాతీయవాద ఆలోచనలు దినదిన ప్రవర్థమానమ‌వుతున్నాయని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు.

హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శనివారం సాయంత్రం జరిగిన నవయుగ భారతి ప్రచురణ ‘స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య’ పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వాదాలు పుట్టినప్పటికీ, సానుకూల మార్పును ఆకాంక్షించే జాతీయవాద భావనే అంతిమంగా విజయం సాధిస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు.

జాతీయ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న వాదాలు, వాదనలన్నీ మెల్లి మెల్లిగా నీరుగారి, తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయన్న ఆయన, నాటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక సిద్ధాంతాల మూలాలతో పుట్టిన అనేక సిద్ధాంతాలు జాతీయవాద భావనను విస్మరించిన కారణంగా మెల్లి మెల్లిగా తమ ప్రభను కోల్పోతున్నాయని పేర్కొన్నారు.

మూడు దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారంగా పనిచేసి ఎందరో సామజిక కార్యకర్తలను తీర్చిదిద్ది, పితృవాత్సల్యంతో తన ఎదుగుదలకు మార్గనిర్దేశం చేసిన సోమేపల్లి సోమయ్య జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకురావడం, ఆ పుస్తకాన్ని తాము స్వయంగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి