News

పనిభారంతో పోలీసులు స‌త‌మ‌తం!

564views
  • ప్ర‌ధాని మంత్రి మోదీ

గాంధీనగర్‌: స‌్వాతంత్య్రం సిద్ధించి, ఏళ్ళు గ‌డుస్తున్నా పోలీసుల‌పై అద‌న‌పు ప‌నిభారం ప‌డుతోంద‌ని, దీని వ‌ల్ల వారు ఇబ్బందులకు గుర‌వుతున్నార‌ని ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. గాంధీనగర్‌లోని శనివారం జ‌రిగిన‌ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ (ఆర్‌ఆర్‌యూ) తొలి స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ అంతర్గత భద్రతా వ్యవస్థను ఆధునీకరించేందుకు స్వాతంత్య్రానంతరం పెద్దగా ప్రయత్నాలే జరగలేదని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచితే చాలదని, టెక్నాలజీ, జనం సైకాలజీ, యువతరం భావోద్వేగాలను అర్థం చేసుకునే నైపుణ్యమున్న శిక్షితులైన అధికారులు తక్షణావసరమని ప్రధాని పేర్కొన్నారు.

పోలీసులంటే వారికి దూరంగా ఉండాలన్న భావనే కన్పిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వెలిబుచ్చారు. బ్రిటిష్‌ హయాంలో జనాలను భయభ్రాంతులను చేయడమే అంతర్గత భద్రతా వ్యవస్థ లక్ష్యంగా ఉండేదని గుర్తు చేస్తూ ఈ పరిస్థితిని మార్చేందుకు తక్షణం సంస్కరణలు రావాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.

‘‘పోలీసులు సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించగలగాలి. ప్రజలతో సున్నితంగా వ్యవహరించి వారిలో స్నేహభావన, నమ్మకం పెంపొందించాలి. అంటే శిక్షణ పద్ధతుల్లోనే మార్పు రావాలి’’ అని తెలిపారు. పోలీసు సిబ్బంది విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ప్రధాని గుర్తు చేశారు.

‘‘వారికి ఆసరాగా నిలిచే ఉమ్మడి కుటుంబాల వంటి సంప్రదాయ వ్యవస్థలు క్షీణించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పైగా నేటి పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉంటే చాలదు. మానసికంగా కూడా దృఢంగా ఉండాలి.” అని ప్రధాని స్పష్టం చేశారు.

శారీరక వైకల్యమున్నా మానసికంగా దృఢంగా సిబ్బంది భద్రతా వ్యవస్థలకు ఎంతగానో ఉపయోగపడగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వారికి యోగ శిక్షణ, నిపుణుల మద్దతు వంటివి తప్పనిసరని అభిప్రాయపడ్డారు.

ప్రైవేట్‌ సెక్యూరిటీ వ్యవస్థ, సంబంధిత స్టార్టప్‌ల విస్తరణను కూడా ప్రస్తావిస్తూ ఆర్‌ఆర్‌యూ విద్యార్థులు వాటిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. భద్రత, రక్షణ తదితర రంగాల్లో మహిళల రాక పెరుగుతుండటం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి