
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.
మాలిక్ బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ముంబయిలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం ఏడు గంటలకు విచారణ చేపట్టారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీం బంధువుతో ఉన్న సంబంధాలపై మంత్రిని విచారించినట్టు తెలిసింది. దావూద్ అక్రమ ఆస్తులు, కొద్ది రోజుల కిందట అరెస్టయిన దావూద్ సోదరుడు ఇబ్రాహీం కస్కర్‌తో సహా పలు అనుమానిత నిందితులకు సంబంధించిన సంబంధాలపై ఈడీ ప్రశ్నించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
దావూద్, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్ మాలిక్ కొనుగోలు చేసినట్టు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దావూద్‌కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశింతంగా పరిశీలిస్తోంది ఈడీ. ఇబ్రాహీం కస్కర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత.. విచారణలో కీలక రహస్యాలను ఈడీకి వివరించినట్టు అధికారులు తెలిపారు. ఆ విషయాల ఆధారంగానే నవాబ్ మాలిక్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ కొంతకాలం కిందట ముంబయి, పుణె సహా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకుంది. అందులో అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, అనుమానాస్పద బ్యాంకింగ్ లావాదేవీల పత్రాలు ఉన్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ పత్రాలపైనే మాలిక్‌ను ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. నవాబ్ మాలిక్ ఈడీ కార్యాలయానికి చేరుకున్న సమయం నుంచి ఆయన నివాసాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్టు అధికారులు చెప్పారు.
Source: EtvBharat





