
భాగ్యనగరం: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వహణకు భారీ కసరత్తు జరుగుతోంది. 216 అడుగుల విరాట్ మూర్తి, 120 కిలోల బరువున్న 54 అంగుళాల స్వర్ణమూర్తి, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ క్షేత్ర నిర్వహణకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ క్షేత్రంలో దర్శనానికి రుసుము పెడుతున్నారు.
తొలుత పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.200 టికెట్ ధర పెట్టాలని భావించారు. కానీ అది భక్తులకు భారమవుతుందన్న భావనతో దాన్ని రూ.150కి తగ్గించాలని అనుకున్నారు. అది కూడా ఎక్కువ అవుతుందని కొందరు కమిటీ సభ్యులు పేర్కొనటంతో పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా ఖరారు చేశారు. మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.
రామానుజాచార్యుల స్వర్ణ మూర్తికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహానికి ఆరు నుంచి ఎనిమిది అడుగుల దూరం నుంచి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ఫ్రేమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసేవరకు స్వర్ణమూర్తి సందర్శనకు అనుమతించరు. ఈ ప్రాంతంలో సాయుధులైన రక్షణ సిబ్బంది 24 గంటలూ పహారాలో ఉంటారు.





